అలసిన మేను సేద తీరే తరుణం
ఆవిష్కరించును ఎల్లలు లేని
ఎన్నడు యోచించని కొత్త ప్రపంచం
వివరము చూడ మొదలవును
అంచులు కానని ఆశల స్వప్న సోపానం
గమ్యం ఎరుగని మనసు ప్రయాణం
రంగులు కాంచని కొత్త స్వరూపం
రెక్కలు విప్పిన ఇచ్చముల సమాహారం
అంతే లేని కోరికల సమూహం
దాచుకున్న తలపుల సారం
ఒళ్ళు తెలియని వింత మైకం
కను రెప్పల చాటున దాగిన శోకం
మదినేలే ముచ్చటల మోదం
పరుచుకున్న ప్రశాంతమైన వాతావరణం
అనుభుక్తులకందని నిశ్శబ్ద ఏకాంతం
అభూత కల్పనల ఆకారం
ఊహకందని అసంకల్పిత కథనం
ఆకృతి కానని కట్టడం
సృష్టికందని నిర్మాణం
దూరం కొలవని ప్రస్థానం
యాతన తెలియని శరీరం
ఋతువులు రాని కాలం
గమనం నేర్వని సమయం
సకల జీవుల అస్తిత్వానికి అతీతం
మేథకు అందని మాయా లోకం
మరణానికి మరో రూపం
సూక్ష్మ శరీరమనుభవించు కర్మఫలం
ఆనందం ఆహ్లాదం
దుఃఖం భయం
క్రోధం ఉల్లాసం
అనుభూతుల మధ్య ఓలలాడు
అంతరాత్మను తట్టి లేపుతుంది అలారం
కన్న కలను నెమరు వేసుకోగ
కొత్త కలను తీర్చిదిద్దుకోగ
పరుగున సాగుతుంది
మరల నూతన జీవన పయనం
Leave a Reply