కవితార్చన – 12

మేరు నగము ఢీకొన మేఘమునకెంత ముచ్చట
కురియగానె భారమంత‌ సాగిపోవు తేలికగా
ఓదార్చు ఒడిని చేర శిరమునకెంత సాంత్వన
మనసు పడిన ఆర్తమె కన్నీరుగ మారగా
సృష్టికి ప్రతిసృష్టి చేయ తల్లి పడే వేదన
ముద్దులొలుకు పసి పాపల మోముకాంచి‌ మురియగ
కడలి చేర బిర‌ బిరా‌ నదులకెంత యాతన
కలిసిపోగ ఉనికి మరచి గమ్యంనే చేరగా
క్రుంగు మదికి రెక్క చాచు పక్షి ఎంత ప్రేరణ
తరచి చూడ తరుణములే నింగి నేల హద్దుగా
తనివితీర నాట్యమాడ మువ్వకెంత‌ తపన
నవ రస‌ తాళ భంగిమలే పలికించగా
పరుల మేలు మదిని తలచె ప్రార్థనెంత కమ్మన
భేదభావ రహిత భవితవ్యం బాసటగ
మగువ కురులు చేరగ మల్లెపూలకెంత వేడుక
పరవశించు ప్రాణనాథ మనసునెంచ బిడియంగా
గుండె దాటి‌ బయట పడగ‌ తలపులకెంత ఆత్రమొ
పంచుకొనగ ప్రేమతీర వలపులన్ని తియ్యగా
ధరణి చెరను వీడి‌ పెరుగ పైరుకెంత పంతమొ
బ్రతుకు కోరె బాటసారి ఆకలినే తీర్చగ
వేచి చూడ ఆ క్షణమునకై కుసుమాలకెంత సహనమొ‌
ఈశుని పాదాల చెంత మోక్షమునే పొందగా
పదములగా మారగ అక్షరాలకెంత ఆశనో
ఆలపించ ఆలయాన భక్తి రాగ కీర్తనగా
ఊపిరిగా మారాలని గాలికెంత తపన
వేణు గానమై మధురముగా అధరమునే తాకగా
భక్తి మీర భజన చేయు భక్తుడెంత ధన్యమో
మదియంతా భగవంతుని నామ స్మరణ నిండగా
ఉలి చాటున మలవగా రాయి దెంత పుణ్యమో
ప్రాణ కోటి అర్చించగ అమ్మవారి రూపుగా/ప్రతిమగా
పాపులని భరియించగా పుడమితల్లికెంత కరుణనో
ప్రకృతి కాంతని పరిరక్షించగ పడుగు అడుగులకాసరగ
కలము తాకి కాగితాన వ్రాల కవితకెంత కాంక్షయో
గళం కదిపి జనం మెచ్చ రసానుభూతినే పొందగా

ఊయలూగు పిల్లపాపల హితము తలచి
భారమన్న తలపు మరచి చేజారనీక ఒడిసి పట్టి
వారి ముఖము‌నందు వెలుగు చూడ
సంతసమున తేలియాడు

చేయి పట్టి మెడలు వంచి గాయపరచ
నెపమెన్నక ఆకలన్నవాని మనసెరిగి
తనలో చిరు పాలుని పంచగ
అమ్మతనంలోని కమ్మతనం
అనుభవించి ఓలలాడు

తన పంచన చేరువాని బడలిక తీర్చనెంచి
కోరుకోగ సౌఖ్యం తన మేనునే కోసి ఇచ్చి
నాన్నతనంలోని గొప్పతనం చవిచూడగ
ఉల్లాసమున‌ ఊగులాడు

పండుగైన వేడుకైన
అందమైన ఆనందమైన
భగవంతుని అలంకారమైన
సుఖమైనా దుఃఖమైన
గుడ్డివాని ఊతమైన
ప్రతి శాఖకి ఆలవాలమైన
మహీజమును మనుజులం
కానలేము మేలుకోము
శ్రద్ధ అనే ధ్యాస రాదు
పోషణనే బాస లేదు

ముఖము వాడ మెడలు వంగ
ధరణి ఒడిని సేద తీర
కనులు వాలి తరువు ఒరగ
పలువురు చేరి పరిపరి విధములు పొగడె
పంచ ప్రాణములు పైకెగరగ

ఉన్నప్పుడు విలువ లేదు
ఉనికి ఘనత తెలుసుకోరు
పాపమనె సంగతి కనరు
పోయాక మరచిపోరు
మాను మనిషి ఒకటే కదా
ఒకే పెట్టెలో ప్రయాణించు
ఒకే గమ్యం చేరుకునే
రెండు జీవితాలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: