ఒక గర్భము పంచుకుని
ఒక దారం తెంచుకుని
కర్మఫలముననుసరించి
తోబుట్టువులుగ మారి
అనురాగం ఆలంబనగ
అల్లుకొనును బంధములు
అమ్మ నాన్నల ఆత్మల పాలు
సంతతి శ్వాశ నిశ్వాశలు
ముద్దు మురిపెముల మురిసి
ఆనంద ఝరిలొ తడిసి
ప్రపంచంలో పలు దిక్కుల
బతుకు తెరువుకై పయనించె
తిరిగి చూడ చిన్నతనము వంక
ఎన్నెన్ని స్మృతులో ఎనలేని మోదములో
అమ్మ పెట్టు ఆవకాయ ముద్దకై పోటీ
నాన్న చెప్పు చిట్టి కథలకేదీ సాటి
అమ్మ ఒడిని పంచుకొనగ సాగేటి పంతం
నాన్న తెచ్చు కొత్త బుక్కుకై ఎదురు చూచు ఆత్రం
అమ్మ కట్టి ఇచ్చు ఆ ఫలహారమెంత మధురం
నాన్న స్కూటరెక్కి పాఠశాలకెళ్ళుటెంత గర్వం
అలసిన తనువుకు అమ్మ స్పర్శ కమ్మదనం
నేనున్నాననె నాన్న పలుకు ఒక బలం
అమ్మ తోటి పెళ్లి పేరంటాళ్ళకెళ్ళుటకెంత ఆరాటం
నాన్న తోటి క్లాసు బుక్కుల అట్టలేయుటెంత ఉల్లాసం
దీపావళి టపాసులు దాచుకొనెడు కయ్యం
కలిసిమెలిసి పాలవెల్లి కట్టుకున్న వైనం
వీక్షించిన మేటి సినిమాలు
మేలుకొని నిద్ర కాచిన రాత్రులు
బ్యాటింగుకై తగాదాలు
అమ్మకి చేసిన ఫిర్యాదులు
హోటల్లో భోజనాలు
హాయిగా నవ్విన క్షణాలు
వేడుకైన రైలు ప్రయాణాలు
సుందర విహారాల చిత్రాలు
చిలిపి కలహాల సందర్భాలు
కొసరి కొసరి వడ్డించిన పదార్థాలు
కొత్త కారు సంబరాలు
ఎగ్జిబిషన్ తిరగడాలు
మిరప బజ్జి కారాలు
కొత్త సరుకు కొనుగోళ్ళు
వీడుకోలు కన్నీళ్ళు
రాసుకున్న ఉత్తరాలు
ఫోను కొరకు పడిగాపులు
రాక కొరకు ఎదురుచూపులు
ఎన్ని కాలాలు మారినా
కొత్త బంధాలు కలిసినా
చెదిరిపోవు ఆ తీపి గురుతులు
కరిగిపోవు మధురమైన జ్ఞాపకాలు
ఉప్పొంగగ ఉత్సాహం
సాగిపోవు మాటల ప్రవాహం
కలుసుకున్న ప్రతిసారి సజీవమౌ
అంతేలేని సరదాలు
దాచుకొనగ మది చాటున
పదిలంగా ప్రియమైన సంగతులు
Leave a Reply