గల గలమంటూ గంటల గణ గణ
ఢమ ఢమ అంటూ బాక్సుల రణగొణ
పీ పీ అంటూ హారను పిలవగ
బిర బిరమంటూ అడుగుల లయ
పద పదమంటూ మాటల వరద
వల వల అంటూ ఏడుపు రొద
గున గునమంటూ బుడతల నడక
చక చక అంటూ పెద్దల గడబిడ
హాయ్ హలోఅంటూ పలకరింపులు నడిచెను
పట పటమంటూ బుక్కులు తెరిచెను
రెప రెపమంటూ పేపరు ఎగరగ
బర బరమంటూ కలములు కదిలెను
గుస గుస అంటూ చెవులను కొరకగ
సైలెన్స్ అంటూ వీపులు పగిలెను
కర కరమనుచు ఉదరము ఊగెను
ట్రింగుమన బెల్లుకై ఎదురు చూసెను
టప టపమని బాక్సులు తెరిచెను
చక చకమని ఆహారం చేతులు మారెను
జోకులు పేలెను బల్లలు చరిచెను
మాటలు కలిసెను కాలమె మరిచెను
ప్రసంగాలిచ్చెను పాటలు పాడెను
డ్రామాలేసెను డాన్సులు చేసెను
బొమ్మలువేసెను బహుమతులు పట్టెను
హోరు హోరున క్రీడలు సాగెను
ఈలలు వేసెను గోలలు చేసెను
బొట్టు బొట్టుగా స్వేదము చిందగ
ముఖములు విరిసెను చేతులు కలిసెను
టంగు టంగని ఇంటి గంట మ్రోగెను
భుజమున బరువును మోయగ
బిల బిలమంటూ బయటికి ఉరికెను
చేతులు ఊపెను ముందుకు సాగెను
రేపటి కలయిక కన్నుల మెదలగ
పెదవులపై చిరునవ్వులు విరియగ
ఇంటికి చేరును కన్నులు వాలగ
దీని జిమ్మడిపోను కరోనా కాలం
ఏం మొదలయ్యిందో కానీ
భవనములన్నీ బోసిపోయెను
క్లాసు రూములు కళను తప్పెను
అధ్యాపకుల సంభాషణ సందడి లేదు
పిల్లల అడుగుల సవ్వడి లేదు
మేడమ్ సార్ అనే పిలుపులు లేవు
అరేయ్ ఒరేయ్ అనే అరుపులు లేవు
మునుపటి చదువుల అర్థం మారెను
ఉన్న చోటనే పలుకులు పాఠమాయెను
ఎండ అన్నదే కనుమరుగాయెను
కాంతి తెరలకే పరిమితమాయెను
తల్లిదండ్రుల తాకిడి పెరిగెను
క్లాసుమేటులుగ మారిపోయెను
అమ్మ భోజనమె దిక్కయిపోయెను
ఆంటీ స్నాకులే మిస్సయిపోయెను
ఇళ్ళల్లోనే అసెంబ్లీలు
అమ్మ నాన్నల ఫైటులు ఫీటులు
ఆటలన్నవే అలుసయిపోయెను
వేడుకన్నదే వరమయిపోయెను
కలిసి చదవటం కల అయిపోయెను
ఫీజులు మాత్రం ప్రియమయిపోయెను
బోరు కొట్టెను ఒంటరి వీక్షణం
బడుల కొరకేమో తరగని నిరీక్షణం
కరోనా కి కోవిడ్ వచ్చి చచ్చిపోను
Leave a Reply