శ్రీకరం నీ రూపు
శుభకరం నీ చూపు
భవహరం నీ తలపు
భయహరం నీ ప్రాపు
కరుణ భరితమయిన నీ నయనాలు
కాంతులు చిందించు కైవల్యాలు
నొసటన భాసిల్లు సూర్య బింబం
ప్రసరించు సకల సౌభాగ్యాల కిరణం
నాసికాగ్రమున రవ్వల ధగధగ
పసిడి కాంతిన చెక్కిలె మెరవగ
పారద్రోలును పాపపు చీకటి తెర
కమ్మల కెంపులె తళ తళలాడగ
ముజ్జగములనె సంరక్షించునుగ
అధరముపై సుమధుర దరహాసం
హరియించును లోభ మద మాత్సర్యం
లోకాలేలే నీ అభయ హస్తం
సమస్త పాప భీతిహరం
మంగళప్రదమైన నీ పాద పద్మములు
మోపిన ఎద వెలుగును నిష్కలంక ప్రకాశమున
పఠియించు నీ నామ స్తోత్రములు
అజ్ఞానాన్ని తరిమి కొట్టే వేద మంత్రములు
అతులితమైన నీ శక్తి స్వరూపం
అమృత తుల్యమైన నీ కటాక్షం
చెరిపివేయును మనసున మలినం
కరుణించి ఏతెంచు నా హృదియందు కొలువుండ
వరమివ్వు తరియించ నిను నిత్యమ్ము ప్రార్థించ
స్తుతియింతు నీ ప్రభనంత నశియించ నా అహమంతా
పావనమైన నీ పాదమంట ముక్తి చేరే మార్గమంట
వెదజల్లు నీ తేజమున కరిగించు నా మోహమంత
వేడెద నే శరణం కావగా నీ ప్రభనే నా తనువంతా
అద్భుతమైన నీ కీర్తి వైభవమంతా శ్లాఘించ నా అణువంతా
ఆత్మనే నీయందు నిలిపెద పంచప్రాణాలే భక్తితో విడువంగ
Leave a Reply