నదికి కడలికి కలిగెను మధనము
అందుకోగ పైకెగసి గగనము
కలిసి పోటెత్తగ పైపైకి
క్రింద పడెను ప్రతీసారి
వెతను చూచి జాలి ఎంచి
భానుడు ఒక ఉపాయము పంచెను
స్థితి మార్చగ గతి పెంచగ
తెల్లని మబ్బుల దొంతరగా
చేరుకొనెను గమ్యము
సాగిపోగ కొంతదూరము
భారమాయె దాని పయనము
కొండ అంచున సేదతీరుచు
తొంగి చూసెను ధరణి మాతను
ఇచ్ఛ కలిగెను ఒడిన చేరగ
తారలన్ని ఏరుకొనగా
కురవసాగెను చిరుజల్లు వానలా
పుడమి తల్లి నాట్యమాడెను
స్వాగతించెను సంబరంగ
దాచుకున్న కాంక్షలన్ని పురివిప్పగ
కోక కట్టిన కాంతలా వికసించేను పచ్చగ
చేనుగ మారెను ఆకలి తీర్చెను
నదిగ మారెను దప్పిక తీర్చెను
జీవకోటి ప్రతి అణువులోను
భాగమయ్యెను ప్రాణమయ్యెను
ఎంత మార్పు చెందినా
ఎన్ని రూపులెత్తినా
జడధి కలువుటే నీర లక్ష్యము
ఆత్మరామునికాయెను మనసు
పరమాత్మను చేర చేసెను తపసు
జన్మములెత్తెను కర్మలు చేసెను
మోక్షమునొందగ మార్గములెతికెను
గుడిని చేరెను శరణు వేడెను
స్వామి నవ్వెను అభయమునిచ్చెను
సత్కర్మ యోచన
నిష్కామకర్మ సాధన
నిర్మలమైన వాక్కులు
నిశ్చలమైన భావనలు
నిర్మోహమైన సుఖములు
అసంగతమైన సాంగత్యాలు
భగవంతుని నామ స్మరణాలు
అనుసరించగా ఈ ధర్మములు
ఆచరించ తన నిత్య కర్మములు
జీవాత్మయె పరమాత్మగ మారును
విశ్వమునందే విలీనమగును
అనివార్యమైన ఈ జీవన చక్రానికివి
భవుని చేర పరీక్షలు కారెవరు దానికి అతీతులు
పుట్టుట గిట్టుట సృష్టి స్వభావము
ముక్తినెంచ పాటించుము కర్మ సిద్ధాంతము
ఆది అంతము అంతా బ్రహ్మాండము
మొదలునందే తుదను వెతుకును
వింతైన వేదనం విచిత్రమైన పయనం
అనంతములో కరిగిపోవాలని ఆపేక్ష
అంతమవ్వగ అశేషమున నిరీక్షణ
భయం వెనుక ఉంది జయం
అడుగు ముందుకేసి అందుకో విజయం
Leave a Reply