మబ్బున మెరుపునై ఒక క్షణము మెరవాలని ఉంది
కోటి తారలై మరుక్షణము ప్రజ్వలించాలని ఉంది
ఎండమావినై ఒక క్షణము భ్రమ కలిగించాలని ఉంది
శ్రావణపు చినుకునై మరుక్షణము తడిసిపోవాలని ఉంది
పెద్ద ఉరుమునై ఒకక్షణము గర్జించాలని ఉంది
ప్రియ వరమునై మరుక్షణము దీవించాలని ఉంది
సూటి శరమునై ఒకక్షణము ఛేదించాలని ఉంది
అభయ కరమునై మరుక్షణము రక్షించాలని ఉంది
సుడి గాలినై ఒక క్షణము చుట్టెయ్యాలని ఉంది
గట్టి మాంజనై మరుక్షణము పట్టుకోవాలని ఉంది
నల్లని మబ్బునై ఒక క్షణము కమ్మెయ్యాలని ఉంది
తెల్లని కాంతినై మరు క్షణము వెన్నెల పంచాలని ఉంది
కారు చిచ్చునై ఒక క్షణము దహియించాలని ఉంది
చల్లని మంచునై మరుక్షణము కరిగించాలని ఉంది
చేనుకు పక్షినై ఒక క్షణము త్రుంచివేయాలని ఉంది
పైరుకి ఎరువునై మరుక్షణము పైకి ఎదగాలని ఉంది
పోటెత్తిన కెరటమై ఒక క్షణము ముంచెయ్యాలని ఉంది
పారే నీరునై మరుక్షణము ప్రాణమవ్వాలని ఉంది
కడలి తుఫానునై ఒక క్షణము కల్లోలపరచాలని ఉంది
తెరిచిన తెరచాపనై మరుక్షణము తీరానికి చేర్చాలని ఉంది
రెక్క విప్పిన పిట్టనై ఒక క్షణము నింగి తాకాలని ఉంది
పసి పాపనై మరు క్షణము అమ్మ ఒడిని చేరాలని ఉంది
మహా వృక్షమై ఒక క్షణము విస్తరించాలని ఉంది
నాన్న ఎదను చేరి మరుక్షణము నిదురించాలని ఉంది
ప్రచండ కోపమై ఒక క్షణము కలిచివేయాలని ఉంది
గాయపడిన మనసుకే మరు క్షణము మందుగా మారాలని ఉంది
పొగిలే దుఃఖమై ఒక క్షణము అలసిపోవాలని ఉంది
పెదవిపై చిరు నవ్వునై మరు క్షణము మురిసి పోవాలని ఉంది
ఉబికే కోరికనై ఒక క్షణము ఎగసి పోవాలని ఉంది
పాలమీద పొంగులా మరుక్షణము చల్లారాలని ఉంది
విరిసే ఊహనై ఒక క్షణము తేలిపోవాలని ఉంది
రసానుభూతినై మరుక్షణము మిగిలిపోవాలని ఉంది
తీరని బాధనై ఒక క్షణము గుండె పిండాలని ఉంది
వెచ్చని ప్రేమనై మరు క్షణము ఓదార్చాలని ఉంది
తెలియని భావనై ఒక క్షణము యుద్ధం చేయాలని ఉంది
అలవికాని ఆనందమై మరుక్షణము సేద తీరాలని ఉంది
తుంటరి తుమ్మెదనై ఒక క్షణము తేనె గ్రోలాలని ఉంది
పచ్చని కాడనై మరుక్షణము చేయూతనివ్వాలని ఉంది
తెగిన గాలిపటమునై ఒక క్షణము అలజడి రేపాలని ఉంది
తెల్లవారు ప్రకృతిలా మరుక్షణము నిలిచిపోవాలని ఉంది
జారే జలపాతమై ఒక క్షణము ఢీకొట్టాలని ఉంది
అచల ఓర్పునై మరుక్షణము సహియించాలని ఉంది
అమాస చంద్రుడిలా ఒక క్షణము సమసి పోవాలని ఉంది
చైత్రమాసపు చిగురునై మరుక్షణము పూత పూయాలని ఉంది
పొలయు వాసనై ఒక క్షణము వ్యాపించాలని ఉంది
మల్లెల సుగంధమై మరుక్షణము పరిమళించాలని ఉంది
కంటి పాపనై ప్రతి క్షణము కదలాలని ఉంది
గుడి దీపమై అనుక్షణము వెలగాలనిఉంది
Leave a Reply