కనుగొంటి నీ కంట పరవశించిన చూపంట
రామయ్యని కనినంతనె తన్మయమె నీ మోమంత
సీతమ్మ రామయ్య మనములే రంజింప
బాసితివి ఇక్కములె జలధియే లంఘించ
శ్రీరామ దాసులలో నీ సాటెవరు లేరంట
నిత్యము రామ నామ సంకీర్తనే చేయంగ
ఏమి సౌభాగ్యము నీది స్వామి వాత్సల్యము పొంద
ధన్యుడవైతివి సీతారాములె హృదినందె నివసించ
ఆత్మనే అర్పించి చరణముల అఖిలముగ
మార్గమే చూపితివి రామభద్రునే కొలువంగ
తపములే చేసితివి రఘురామునే దర్శించ
ఇహమునే మరచితివి బ్రహ్మానందమె పొంద
ఎంత విన్నను కానీ తనివితీరదు ఏల
నీ నోట కోదండరామ కథామృత లీల
రామ నామమె కదా నీ ఆశ నీ శ్వాశ
వాసికెక్కగ దాశరథి యశము నలు దిశల
ఏ రీతి అర్చింతు ఈ పరమ భక్తుడిని
ఏ తీరు నుతియింతు కానున్న బ్రహ్మను
ఏ గరిమ శ్లాఘింతు ఈ రుద్ర రూపుండ
ఏ విధము సేవింతు ప్రియ వాయు పుత్రుండ
ప్రణమిల్లి వేడెదను నీ కృపయందు తరియించ
శరణందు దివ్య పదమందు నీ దయనె కడతేర
Leave a Reply