అపరిచిత వదనములనుండి
అపరిమితమైన అనురాగం వరకు
మన ప్రేమప్రయాణం ఒక తియ్యని జ్ఞాపకం
ఎంచలేని భావనలనుంచి
తెంచలేని దాంపత్యం వరకు
మన సహచర్యం ఒక మధురమైన జ్ఞాపకం
నీది నాదను సంగతులనుంచి
ఏదైనా మనదే కదా అనే విషయం వరకు
మన స్నేహం ఒక చెదిరిపోని జ్ఞాపకం
నా సుఖం నాది నీ దుఃఖం నీదినుంచి
నీ దుఃఖం నాది నా సుఖం నీది వరకు
మన ప్రేమైకం ఒక మరిచిపోని జ్ఞాపకం
వేడుకైన అల్లరితనం నుంచి
వదిలిపెట్టని బాధ్యత తనం వరకు
మన ప్రణయం ఒక అలవికాని జ్ఞాపకం
చెంపని నిమిరిన కన్నీరు నుంచి
మనసుని తడిపిన ఆనందభాష్పాల వరకు
మన ఆలంబనము ఒక అద్వితీయ జ్ఞాపకం
తెర తీసిన క్షణాల నుంచి
మది తొలగిన అపార్థాల వరకు
మన గమనం ఒక పదునైన జ్ఞాపకం
అలకల కులుకల నుంచి
మనసు భాషను చదివే వరకు
మన ప్రియతనము ఒక కమ్మనైన జ్ఞాపకం
కలహాల ప్రహసనాల నుంచి
విలాసాల సావాసాల వరకు
మన సాంగత్యం ఒక మిడిసితనపు జ్ఞాపకం
నీతో నేను గడిపిన ప్రతి క్షణము జ్ఞాపకమే
నాతో నువు జతకలిపిన ప్రతి అడుగు జ్ఞాపకమే
మనమన్నది మరిచిపోయిన ప్రతి నిమిషం జ్ఞాపకమే
అనుభూతి నెంచి పరవశించిన ప్రతి పలుకు జ్ఞాపకమే
Leave a Reply