ఈశ్వరుడే ఆనతి సేయ
అగ్నిదేవుడు సాక్షి కాగ
శిరము తాకి ప్రతినబూని
చేయి కలిపి బాస చేసి
నమ్మికన్న సూత్రదారము
ప్రేమ ముడుల బంధమవగ
కలల అడుగుల కలిసి నడిచి
ఆశలనె అంకురార్పణగ మార్చి
మొదలు పెట్టు అపూర్వ పయనం
ఒక అద్భుత పరిచయం పరిణయం
రెండు మనముల ఒక్క యోచనై
జంట కన్నుల ఒక్క చూపై
లోపమన్నది మదిని ఎంచక
తనని తానుగ స్వీకరించగ
వ్రతము చేసిన క్షణము మరవక
నీ నా తనమును మన తనముగ తలచగ
హెచ్చు తగ్గుల లెక్కలెంచక
సమము మిన్నని రుజువు చేయగ
కష్ట సుఖముల భేదమెంచక
సకల విధముల సమ్మతించుచు
జగతి కడలిన సంసార నావను
దరిని చేర్చ సిరుల సంతతి
ఓర్పు కడపున బ్రహ్మముడిగ
కట్టుబడిన పవిత్ర సంతకం
ఒక చెదిరిపోని ఆదర్శ దాంపత్యం
Leave a Reply