రావణుడు పరుషజాలమాడ
సీత ధరియించిన మౌనం ఒక వేదన
దుశ్శాసన చెరబట్టగ శిరసు వంచి
కురుసభనేలిన మౌనం ద్రౌపదియొక్క రోదనం
పితరుల ఆన మీరక రాముడు
వహించిన మౌనం ఒక ఆదర్శం
శిశుపాలుని నూరు తప్పులెన్న
వాసుదేవుడు దాల్చిన మౌనం ఒక ప్రాణం
పుత్ర ప్రీతి కన్నుగప్ప అశక్తుడైన
ధృతరాష్ట్రుడి మౌనం ఒక సమరం
శ్రవణ కుమారుడి ఆక్రందన వెనుక
దశరధుని అసహాయ మౌనం ఒక శాపం
పతి మాటను తల ఎత్తక
నడుచుకున్న సతి మౌనం ఒక బిడియం
ఆనందబాష్పాల హత్తుకొనగ మనసుల
మధ్య సాగే మౌనం ఒక అనురాగం
భుజము తట్టి ఓదార్పు పంచగ
అశ్రునయనాల మౌనం ఒక స్నేహం
కీర్తి శిఖరాల అందుకొనగ
ఎదనిండిన మౌనం ఒక అభిమానం
ఈశ్వరునారాధించ దాసుని
అంతరంగమందునున్న మౌనం ఒక ధ్యానం
ప్రకృతి కాంచి పరవశించ చిత్రకారుని
హృదినాక్రమించిన మౌనం ఒక ఆరాధనం
మధువు గ్రోల దరిచేరిన తేనీగను కావ
సుమమునావహించిన మౌనం ఒక ఆనందం
అన్యాయము కని కసరలేని
పెదవి చాటు మౌనం ఒక పాపం
అధర్మాన్ని ప్రశ్నించగ గళం
వీడిన మౌనం ఒక ఆవేశం
దొరతనమును నిగ్గదీయ చేతకాని
దమ్ము లేని ప్రజల మౌనం ఒక అవమానం
ముదము కూర్చగ మౌనమాడుట
మేటి కదరా మిత్రమా
మేలు చేయగ మౌనమన్నది
విలువ చేయును మాటకన్నను
నీతి విడవగ ప్రాణమొప్పక
శీలమన్నది గతి తప్పి మెలుగగ
మౌనమన్నది కారాదు మాత్రమొక మాట
మౌనమన్నది కాజాలదు సంఘానికొక గరిమ
భాషకందని భావాల సంగమం
నవరసాల సారం ఈ మౌనం
కాలమెరుగదు ఖ్యాతి గాంచదు
హితమునెంచగ నడుచుకొనుటయె
మానవుల యొక్క ధర్మం
లోపమెన్నగ గీత దాటుట
సమాజం యొక్క కర్తవ్యం
Leave a Reply