పచ్చని పరువాల ఆకు నీవు
ముత్యపు తళుకుల చినుకును నేను
పసిడి కాంతులీను సూర్యోదయం నీవు
ప్రకృతిని మేల్గాంచు చల్లని పొగమంచుని నేను
ఉరుకుల పరుగుల కడలి కెరటమే నీవు
తీరం చేరగ పరిచిన తెల్లని నురగనే నేను
గగనపు నుదుటన మెరిసే సూర్యబింబమే నీవు
దృష్టి తగలనీయనంటు కౌగిట నిను దాచిన నీలి మబ్బని నేను
చిరుగాలుల తహతహకు సన్నగ వణికిన మేనువే నీవు
హాయినిచ్చి వెతను తీర్చ తాకిన నులి వెచ్చని కిరణమే నేను
మోము కళను చిందించగ మురిసి కులికిన అద్దమే నీవు
తనివితీర సొగసు కనగ పరవశించిన ప్రతిబింబం నేను
తళుకు బెళుకు చలనముల పారాడే జలమువే నీవు
నిను తాకగనే పులకరించు నీటిబుడగనే నేను
స్వచ్ఛమైన మనసు నిండిన క్షీరమే నీవు
మదిని గెల్చి ముదమునొందు పాలపొంగునే నేను
కనులు కలిపి మరులు గొలువ కలవరమే నీవు
శిరము తాకి తపన తీర్వ తొలగిన తెర వరమే నేను
సరసపు సోయగాల తనువు గనిని నిమురుతున్న రవి శోభవు నీవు
సిగ్గు దొంతరె అడ్డుపడగ హత్తుకోలేని నీడనే నేను
ప్రకృతివి నీవైతే
ప్రేమికుడిని నేను
బంధం క్షణమయినా
అనుబంధం శాశ్వతం
మన ప్రణయం మిథ్య అయినా
ఆనందము తథ్యమే కదా
రెప్ప వేయని సౌందర్యం
తాకీ తాకని మన సంబంధం
కొనసాగని జత పయనం
పెనవేసిన మన సాంగత్యం
చెరిగిపోయేటి మన సాన్నిహిత్యానికి
పరవశించేను ప్రతి హృదయం
ఎదురు పడిన ప్రతి తరుణం
మనసునిండా ఆహ్లాదం
Leave a Reply