ఎద నిండ నింపుకుని ఎలుగెత్తి పిలువగా
ఏడు కొండల మీద ఎంకన్ననార్తిగా
కనుల ముందరె కాంచగ
అభయ హస్తములతోడుగ
కలవరపడుతున్నది మది కొండనెక్కగ
కరుణనిండిన నేత్రములను కావగ
ఆనతినియ్యవయ జాగును చేయక
హోరెత్తు నీ నామ సంకీర్తనముల
తరియింతును నీ మంగళ పదముల
కరుణించుము నను వేగిరముగ
ఇక వేచి చూడ నా వల్ల కాదయా
గోవిందా గోవింద
కవితార్చన – 6
తలవంచి నీ వెంట నడిచింటి నేనంట
కష్ట సుఖముల తోడ కలిమి లేముల నీడ
కరిగి పోయెన కాలము, చిరు కయ్యమునెంచ
కసుబుస్సులను కాంచి కలచేను నా ఎడద
కొండంత నీ ప్రేమ శంకింప నేనెంత
తప్పులన్ కాచి మన్నించు నా మదినెంచి
నా హృదిని ఏలేటి రారాజు నీవేనంట
నీకేల నినదించు నా శ్వాశ నీదేనంట
ఎన్నాళ్ళొ కానీ నా యాత్ర నీ వెంట
ఏమియ్య తీరునో నీ యందు ఋణమంట
జననమెక్కడ కానీ, మరణమ్ము నీ చెంత
కన్ను మూసేవేళ ఆ చివరి క్షణమంట
నమ్ము నిక్కంబు నీ రూపు నా కంట
పెదవి దాటని మాట పదములై మారె ఈ పూట
మనస్సాక్షియే అక్షరములుగ మారగ
కవితార్చన – 5
కన్న తల్లి స్పర్శకి పరిచయమనేదవసరమా
కురుస్తున్న మేఘానికి ఛత్రమొకటి అవసరమా
వెలుగుతున్న సూర్యునికి దీపమొకటి అవసరమా
కదులుతున్న కాలానికి యుగములతో అవసరమా
పచ్చటి బయలున్న పుడమికి ఆఛ్ఛాదనమవసరమా
చక్కనైన చంద్రునిలో మచ్చలెతుకుటవసరమా
హరి కాంచను, హృదయానికి హద్దులెన్న అవసరమా
వేడుకొన హరుని కష్టసుఖాలనేవవసరమా
భజియించగ భగవంతు సంకీర్తనలే అవసరమా
నీ మదినే నివేదించ నైవేద్యం అవసరమా
లోతెరుగని కడలికి తీరమొకటి అవసరమా
మిణుకుమన్న తారల దూరమెన్న అవసరమా
మెచ్చుకోలు వ్యక్తపరచ భాష ఒకటి అవసరమా
మధువులొలుకు నాదానికి భావమొకటి అవసరమా
స్వచ్ఛమైన క్షీరానికి గోవునెన్న అవసరమా
అల్లుకున్న బంధాలకు హెచ్చుతగ్గులవసరమా
తరచి తరచి మనసులలో మలినమెన్న అవసరమా
సాయమడుగు చేతి, కులమతములెన్న అవసరమా
ద్రవ్యానికి పేద గొప్ప భేదములెన్న అవసరమా
మనుషులంత ఒక్కటైతె సరిహద్ధులన్నవవసరమా
మతమన్న మత్తు వదిలి
కులమన్న మన్ను కడిగి
ధరణి మోము ముదమొందగ
మనుగడ సాగించుట అవసరమే అవసరమే
కవితార్చన – 4
సోది చెబుతానమ్మ సోది చెబుతాను
ఉన్నదున్నట్టు దుఃఖమొచ్చేటట్టు
మార్చి ముందరంట మరపురాని కాలమంట
వారానికో సినిమా అంట పక్షానికో పార్టీ అంట
మనసయితె మాళ్ళకెళ్ళెనంట
బోరు కొడితె బార్లకెళ్ళెనంట
అబ్బబ్బ ఏమి జీవితమంట
ఎల్లలు లేని ప్రయాణమంట
అలా జాలీగా సాగిపోతున్న జీవితంలో
ఉన్నట్టుండి ఊడిపడిందమ్మ
ఊహించని ఉల్కాపాతమమ్మ
కరోనా అంట దాని నామధేయమమ్మ
మనిషి బతుకమ్మ ఎగుడు దిగుడాయెనమ్మ
మూతులకు మాస్కులేసెనమ్మ
కడిగి కడిగి కరములు కట్టెలాయెనమ్మ
కాలికి చెప్పు కరిచిపెట్టెనమ్మ
ఇంటికి తాళము మరిచెపోయెనమ్మ
మగని చేతికి మాపు వచ్చెనోయమ్మ
లోకమంత చూపి పొంగిపోయెనమ్మ
పాంటులేమో షార్టులాయెనమ్మ
మీటింగులలో కూరలేరుడాయెనమ్మ
పిల్లగాండ్ల పంతాలు పెరిగి పోయెనమ్మ
బక్కచిక్కి ఇల్లాలు బెదిరిపోయెనమ్మ
సరుకులు తెచ్చుకొనుడు గగనమాయెనమ్మ
స్మార్ట్ యాపులే సక్కని మార్గమాయెనమ్మ
బంథుమిత్రుల రాక ఆగిపోయెనమ్మ
సెల్లు ఫోనులో సొల్లు, గంటలాయెనమ్మ
జూములోన జనాల జాతరాయెనమ్మ
పసి కూనలకు ఆన్లైను క్లాసులాయెనమ్మ
ఇక చెప్పోచ్చేదేంటంటే
కాలం వెనకడుగు వేసెనంట
పెద్దల మాట వేదమాయెనంట
పాత పద్ధతులే పానమాయెనంట
దూరమున్న మనసులు దగ్గరాయెనంట
సోది చెబుతానమ్మ సోది చెబుతాను
కవితార్చన – 3
వ్యక్తపరుచు నేస్తమా
నీ గొంతునున్న భావన
అక్షరాలు మరువక
చక్షితాలు మెరవగా
బిడియాన్నే విడువగా
లోకానికె బెదరక
కన్న కలల సాక్షిగా
కాలాన్నే మరువగా
దాచుకున్న ఆర్తిని
దోచుకున్న మనసుని
నిద్ర లేని రాత్రులని
కూడు తినని పొద్దుల్ని
తెలివి లేని తనువుని
చెప్పలేని భాధని
మాట రాని మౌనాన్ని
పట్టలేని ప్రాయాన్ని
అదుపు లేని ఆశల్ని
గుండెలోతు గోసల్ని
తాళలేని తాపాన్ని
చూపలేని దైన్యాన్ని
ఆపలేని ఆవేశాన్ని
కానరాని కోపాన్ని
పెంచుకున్న ప్రేమని
తెంచలేని తలపుని
తొలకరి జడి వానలా
ఆకు మీద చినుకులా
వీచిన చిరు గాలిలా
విరబూసిన వెన్నెలలా
మగువ మేని సొగసులా
మెడనున్న ముత్యంలా
పసిపాపడి చూపులా
పాలనురగ నవ్వులా
పరుచుకున్న కాంతిలా
పట్టలేని పరువంలా
హత్తుకున్న హృదయంలా
హద్దేలేని మిన్నులా
మరువలేని మైత్రిలా
మరపు రాని జ్ఞాపకంలా
హాయిగా
తేనెలొలుకు మాటలా
మరిచిపోని పాటలా
మల్లెపూల తెలుపులా
తీరుతున్న కోరికలా
వ్యక్తపరుచు నేస్తమా
నీ గొంతునున్న భావన
కవితార్చన – 2
వానా వానా వల్లప్ప
మా హైదరబాదు గ్రేటప్పా
నల్లా నాలాల్ లేవప్పా
నదులూ చెరువులె ముద్దప్పా
నయగార గొప్పేందప్పా
మాకంతకుమించిన ఫ్లో అప్పా
డ్రైనుకు మూతలు లేవప్పా
మునిగిన శాల్తీ గోలప్పా
కారులు బైకులు వద్దప్పా
పడవలు గొడుగులు మేలప్పా
దైర్యంగడుగు వెయ్యప్పా
దేవుడె నీకు దిక్కప్పా
రస్తాలెతుకుట వేస్టప్పా
నీ కిస్మతె నీకు ఉందప్పా
ఆశే చావని జీవప్పా
అలుపెరుగక ఓటు వెయ్యప్పా