సోది చెబుతానమ్మ సోది చెబుతాను
ఉన్నదున్నట్టు దుఃఖమొచ్చేటట్టు
మార్చి ముందరంట మరపురాని కాలమంట
వారానికో సినిమా అంట పక్షానికో పార్టీ అంట
మనసయితె మాళ్ళకెళ్ళెనంట
బోరు కొడితె బార్లకెళ్ళెనంట
అబ్బబ్బ ఏమి జీవితమంట
ఎల్లలు లేని ప్రయాణమంట
అలా జాలీగా సాగిపోతున్న జీవితంలో
ఉన్నట్టుండి ఊడిపడిందమ్మ
ఊహించని ఉల్కాపాతమమ్మ
కరోనా అంట దాని నామధేయమమ్మ
మనిషి బతుకమ్మ ఎగుడు దిగుడాయెనమ్మ
మూతులకు మాస్కులేసెనమ్మ
కడిగి కడిగి కరములు కట్టెలాయెనమ్మ
కాలికి చెప్పు కరిచిపెట్టెనమ్మ
ఇంటికి తాళము మరిచెపోయెనమ్మ
మగని చేతికి మాపు వచ్చెనోయమ్మ
లోకమంత చూపి పొంగిపోయెనమ్మ
పాంటులేమో షార్టులాయెనమ్మ
మీటింగులలో కూరలేరుడాయెనమ్మ
పిల్లగాండ్ల పంతాలు పెరిగి పోయెనమ్మ
బక్కచిక్కి ఇల్లాలు బెదిరిపోయెనమ్మ
సరుకులు తెచ్చుకొనుడు గగనమాయెనమ్మ
స్మార్ట్ యాపులే సక్కని మార్గమాయెనమ్మ
బంథుమిత్రుల రాక ఆగిపోయెనమ్మ
సెల్లు ఫోనులో సొల్లు, గంటలాయెనమ్మ
జూములోన జనాల జాతరాయెనమ్మ
పసి కూనలకు ఆన్లైను క్లాసులాయెనమ్మ
ఇక చెప్పోచ్చేదేంటంటే
కాలం వెనకడుగు వేసెనంట
పెద్దల మాట వేదమాయెనంట
పాత పద్ధతులే పానమాయెనంట
దూరమున్న మనసులు దగ్గరాయెనంట
సోది చెబుతానమ్మ సోది చెబుతాను
Leave a Reply