కవితార్చన – 27

బాధ్యత ఎరుగని బాల్యం నుంచి
బరువున నలిగిన బంధాల వరకు
చెప్పలేని మధురానుభూతి
మన చెలిమి కలిమి పయనం
స్నేహమన్న మాట వినగానే మనసు
ఆగు మిత్రమా మరల వస్తానని
గుండె అరలొ దాచుకున్న సంగతులను
తోడ్కొని కాలం‌ కరములనే పరిగెత్తించి
మధుర స్మృతుల లోగిలిలో వాలిపోతుంది
ఎదలో పొంగిన ఆనందం
కనులలో దోబూచులాడి
ఆ తలపునే రంజింపచేయగ
పెదవులపై నాట్యమాడుతుంది

తిరిగి కలిసి కరువు తీర
కాలం మరిచి
నెమరు వేసుకుని
మడిచి పెట్టిన జ్ఞాపకాలని
విడిచి పెట్టిన ఆ బంగరు క్షణాలను
అదుపులేని ఆ అల్లరి సందర్భాలను
మైమరచి నవ్విన ఆ సమయాలను
సరదా పాటలను పోటీ ఆటలను
వెలుగు తెరలు దాటుకుని
వెలితి తీర కలుసుకుని
మళ్ళీ పంచుకోవాలనుంది నేస్తం
బరువు దించుకోవాలనుంది నేస్తం

కవితార్చన – 26

ఏమి హాసమది హృది దాసోహమన్నది
ఏమి తేజమది మదిని వెలిగెను భక్తి జ్యోతి
ఏమి వదనమది మోక్ష సాధనమ్ము
ఏమి రూపు అది జ్ఞాన మంథానము
ఏమి ఫాలమది తామస నాశము
ఏమి చూపు అది ప్రీతి పాశము
ఏమి కాంతి అది ధర్మ బాటపు కరదీపిము
ఏమి వాత్సల్యమది కోటి జన్మల పుణ్యము
ఏమి శాంతమది ఎదను ఏలునది
ఏమి నయనమది పాప హరణము
ఏమి చెక్కిలది ముదము చిలుకునది
ఏమి నకుటమది వాసనలు అడచునది
ఏమి అధరమది వ్యధను మాపునది
ఏమి చుబుకమది హర్ష ద్వారము
ఏమి పలుకు అది వేద సారము
ఏమి నామమది ముక్తి ధామము
ఏమి దివ్య మనోహర చందమది
తరచి చూచిన కొరత తీరదు
ఏమి భాగ్యము‌ నాది
నిన్ను కాచి‌ కొలువగ శ్రద్ద కొలది

కవితార్చన – 25

ఈశ్వరుడే ఆనతి సేయ
అగ్నిదేవుడు సాక్షి కాగ
శిరము తాకి ప్రతినబూని
చేయి కలిపి బాస చేసి
నమ్మికన్న సూత్రదారము
ప్రేమ ముడుల బంధమవగ
కలల అడుగుల కలిసి నడిచి
ఆశలనె అంకురార్పణగ మార్చి
మొదలు పెట్టు అపూర్వ పయనం
ఒక అద్భుత పరిచయం పరిణయం

రెండు మనముల ఒక్క యోచనై
జంట కన్నుల ఒక్క చూపై
లోపమన్నది మదిని ఎంచక
తనని తానుగ స్వీకరించగ
వ్రతము చేసిన క్షణము మరవక
నీ నా తనమును మన తనముగ తలచగ
హెచ్చు తగ్గుల లెక్కలెంచక
సమము మిన్నని రుజువు చేయగ
కష్ట సుఖముల భేదమెంచక
సకల విధముల సమ్మతించుచు
జగతి కడలిన సంసార నావను
దరిని చేర్చ సిరుల సంతతి
ఓర్పు కడపున బ్రహ్మముడిగ
కట్టుబడిన పవిత్ర సంతకం
ఒక చెదిరిపోని ఆదర్శ దాంపత్యం

కవితార్చన – 24

అపరిచిత వదనములనుండి
అపరిమితమైన అనురాగం వరకు
మన ప్రేమ‌ప్రయాణం ఒక‌ తియ్యని జ్ఞాపకం

ఎంచలేని భావనలనుంచి
తెంచలేని దాంపత్యం వరకు
మన సహచర్యం ఒక మధురమైన జ్ఞాపకం

నీది నాదను సంగతులనుంచి
ఏదైనా మనదే కదా అనే విషయం వరకు
మన స్నేహం ఒక చెదిరిపోని జ్ఞాపకం

నా సుఖం నాది నీ దుఃఖం నీది‌నుంచి
నీ దుఃఖం నాది నా సుఖం నీది వరకు
మన ప్రేమైకం ఒక మరిచిపోని జ్ఞాపకం

వేడుకైన అల్లరితనం నుంచి
వదిలిపెట్టని బాధ్యత తనం వరకు‌
మన ప్రణయం ఒక అలవికాని జ్ఞాపకం

చెంపని నిమిరిన కన్నీరు నుంచి
మనసుని తడిపిన ఆనందభాష్పాల వరకు
మన ఆలంబనము ఒక అద్వితీయ జ్ఞాపకం

తెర తీసిన క్షణాల నుంచి
మది తొలగిన అపార్థాల వరకు
మన గమనం ఒక పదునైన జ్ఞాపకం

అలకల కులుకల నుంచి
మనసు భాషను చదివే వరకు
మన ప్రియతనము ఒక కమ్మనైన జ్ఞాపకం

కలహాల ప్రహసనాల నుంచి
విలాసాల సావాసాల వరకు
మన సాంగత్యం ఒక మిడిసితనపు జ్ఞాపకం

నీతో నేను గడిపిన ప్రతి క్షణము జ్ఞాపకమే
నాతో నువు జతకలిపిన ప్రతి అడుగు జ్ఞాపకమే
మనమన్నది మరిచిపోయిన ప్రతి నిమిషం జ్ఞాపకమే
అనుభూతి నెంచి పరవశించిన ప్రతి పలుకు జ్ఞాపకమే

కవితార్చన – 23

కలిమి కలిగించగ కాకరపువ్వులు
ముదము పంచగ మతాబు మెఱుగులు
బిర బిర తిరుగుచు విష్ణుచక్రము
కడతేర్చగ కడు కష్టనష్టములు
గిర గిర గెంతుచు భూచక్రము
తరిమివేయగ కలతల వెతలను
తళుకుల బెళుకుల చిచ్చుబుడ్డులు
ప్రతి లోగిలిలో కాంతిని నింపగ
రివ్వున ఎగిరే తారాజువ్వలు
నింగికి మోయగ నిరాశతనమును
ఢమ ఢమ పేలుచు సీమ టపాసులు
అదురు బెదురునే పరిగెట్టించగ
కలిసి వచ్చెను హర్షము నింపగ
ఉత్సాహం మెండుగ ఉల్లాసం పండుగ

దీప కాంతులే ధగ ధగ మెరవగ
ప్రజ్వలిస్తున్న జ్యోతుల నడుమ
యశము‌ స్వాస్థ్యము తోడ్కొనిరాగా
అష్ట లక్ష్ములే కొలువు తీరును
అభయ హస్తమునె సంరక్షించగ
పారద్రోలును పాపపు బెడదను
చెరిపివేయును దైన్యపు తెరలను
విరచిమ్మగ వెలుగును అవిలో,మదిలో
ధనధాన్యమ్ములే రాశులు పోయగ
సౌభాగ్యాల సిరులే పొంగగ
కటాక్షించును కోరికల కుంభము
కలిగించును సంపదల‌ కూరిమి
హితము కూర్చును వంశపు వృద్ధికి
కరుణ చూపున చల్లని దీవెన
ప్రతి ఇంటా‌ దీపావళి కురిపించాలి
కాసుల సిరి ,ఆనందాల ఝరి

కవితార్చన – 22

ముద్దు మురిపాల మూటలు
హద్దులెరగని ఆశలు
జంట తీయని వలపులు
కన్న కలలకు వేసిన బాటలు
మనసు పంచిన సిరులు
పెల్లుబికిన సంతోషాలు
దేవి మెచ్చిన ప్రార్థనలు
వరము ఇచ్చిన మలుపులు
తాతల కళ్ళల్లో వెలుగులు
అమ్మ నాన్నమ్మల గుండెల నెలవులు
తప్పటడుగుల తీరిన తపనలు
తేనె పలుకుల తేలిన మనములు
అనురాగాల మోయు పల్లకీలు
విరిసిన హర్షముల మాలలు
విడదీయలేని బంధాలు
ఓర్పు నేర్పిన గారాబాలు
ఆహ్లాదకరమైన ప్రయాణాలు
ముదములు కూర్చిన వెన్నెలలు
నిస్వార్థము నేర్పిన నేస్తాలు
మాయని మమతల మరులు
ప్రేమ భాష్యాలకి సాక్ష్యాలు
జల జల రాలిన ఆనంద భాష్పాలు
తియ్యని తలపుల సారధులు
నోచిన నోముల దీవెనెలు
కట్టుకున్న స్వప్న సౌధాలు
కదులుతున్న పంచ ప్రాణాలు
కటకటల నిచ్చెన ధైర్యాలు
దృఢముగ నిలిచిన గుండె నిబ్బరాలు
జీవనయానపు మార్గదర్శులు
తడబడనీయని ఆసరాలు
వెతలు తీర్చగ వచ్చిన ఋణాలు
గమ్యం చేర్చే రథాలు
బ్రహ్మాండ సాగరపు తీరాలు
తెరుచుకున్న స్వర్గ ద్వారాలు
కర్మ కొలది సంతానాలు
దేవుని శాసన లీలలు

కవితార్చన – 21

కనుగొంటి నీ కంట పరవశించిన చూపంట
రామయ్యని కనినంతనె తన్మయమె నీ మోమంత
సీతమ్మ రామయ్య మనములే రంజింప
బాసితివి ఇక్కములె జలధియే లంఘించ
శ్రీరామ దాసులలో నీ సాటెవరు లేరంట
నిత్యము రామ నామ సంకీర్తనే చేయంగ
ఏమి సౌభాగ్యము నీది స్వామి వాత్సల్యము పొంద
ధన్యుడవైతివి సీతారాములె హృదినందె నివసించ
ఆత్మనే అర్పించి చరణముల అఖిలముగ
మార్గమే చూపితివి రామభద్రునే కొలువంగ
తపములే చేసితివి రఘురామునే దర్శించ
ఇహమునే మరచితివి బ్రహ్మానందమె పొంద
ఎంత విన్నను కానీ తనివితీరదు ఏల
నీ నోట కోదండరామ కథామృత లీల
రామ నామమె కదా నీ ఆశ నీ శ్వాశ
వాసికెక్కగ దాశరథి యశము నలు దిశల

ఏ రీతి అర్చింతు ఈ పరమ భక్తుడిని
ఏ తీరు నుతియింతు కానున్న బ్రహ్మను
ఏ గరిమ శ్లాఘింతు ఈ రుద్ర‌ రూపుండ
ఏ విధము సేవింతు ప్రియ వాయు పుత్రుండ
ప్రణమిల్లి వేడెదను నీ కృపయందు తరియించ
శరణందు దివ్య పదమందు నీ దయనె కడతేర

కవితార్చన – 20

పచ్చని పరువాల ఆకు నీవు
ముత్యపు తళుకుల చినుకును నేను
పసిడి కాంతులీను సూర్యోదయం నీవు
ప్రకృతిని మేల్గాంచు చల్లని పొగమంచుని నేను
ఉరుకుల పరుగుల కడలి కెరటమే నీవు
తీరం చేరగ పరిచిన తెల్లని నురగనే నేను
గగనపు నుదుటన మెరిసే సూర్యబింబమే నీవు
దృష్టి తగలనీయనంటు కౌగిట నిను దాచిన నీలి మబ్బని నేను
చిరుగాలుల తహతహకు సన్నగ వణికిన మేనువే నీవు
హాయినిచ్చి వెతను తీర్చ తాకిన నులి వెచ్చని కిరణమే నేను
మోము కళను చిందించగ మురిసి కులికిన అద్దమే నీవు
తనివితీర సొగసు కనగ పరవశించిన ప్రతిబింబం నేను
తళుకు‌ బెళుకు చలనముల పారాడే జలమువే నీవు
నిను తాకగనే పులకరించు నీటిబుడగనే నేను
స్వచ్ఛమైన మనసు నిండిన క్షీరమే నీవు
మదిని గెల్చి ముదమునొందు పాలపొంగునే నేను
కనులు కలిపి మరులు గొలువ కలవరమే నీవు
శిరము తాకి తపన తీర్వ తొలగిన తెర వరమే నేను
సరసపు సోయగాల తనువు గనిని నిమురుతున్న రవి శోభవు నీవు
సిగ్గు దొంతరె అడ్డుపడగ హత్తుకోలేని నీడనే నేను

ప్రకృతివి నీవైతే
ప్రేమికుడిని నేను
బంధం క్షణమయినా
అనుబంధం శాశ్వతం
మన ప్రణయం మిథ్య అయినా
ఆనందము తథ్యమే కదా
రెప్ప వేయని సౌందర్యం
తాకీ తాకని మన సంబంధం
కొనసాగని‌ జత పయనం
పెనవేసిన మన సాంగత్యం
చెరిగిపోయేటి మన సాన్నిహిత్యానికి
పరవశించేను ప్రతి హృదయం
ఎదురు పడిన ప్రతి తరుణం
మనసునిండా ఆహ్లాదం

కవితార్చన – 19

మబ్బున మెరుపునై ఒక క్షణము మెరవాలని ఉంది
కోటి తారలై మరుక్షణము ప్రజ్వలించాలని ఉంది
ఎండమావినై ఒక క్షణము భ్రమ కలిగించాలని ఉంది
శ్రావణపు చినుకునై మరు‌క్షణము తడిసిపోవాలని ఉంది
పెద్ద ఉరుమునై ఒక‌క్షణము గర్జించాలని ఉంది
ప్రియ వరమునై మరుక్షణము దీవించాలని ఉంది
సూటి శరమునై ఒక‌క్షణము ఛేదించాలని ఉంది
అభయ కరమునై మరుక్షణము రక్షించాలని ఉంది
సుడి గాలినై ఒక క్షణము చుట్టెయ్యాలని ఉంది
గట్టి మాంజనై మరుక్షణము పట్టుకోవాలని ఉంది
నల్లని మబ్బునై ఒక క్షణము కమ్మెయ్యాలని ఉంది
తెల్లని కాంతినై మరు క్షణము వెన్నెల పంచాలని ఉంది
కారు చిచ్చునై ఒక క్షణము దహియించాలని ఉంది
చల్లని మంచునై మరుక్షణము కరిగించాలని ఉంది
చేనుకు పక్షినై ఒక క్షణము త్రుంచివేయాలని ఉంది
పైరుకి ఎరువునై మరుక్షణము పైకి ఎదగాలని ఉంది
పోటెత్తిన కెరటమై ఒక క్షణము ముంచెయ్యాలని ఉంది
పారే నీరునై మరుక్షణము ప్రాణమవ్వాలని ఉంది
కడలి తుఫానునై ఒక క్షణము కల్లోలపరచాలని ఉంది
తెరిచిన తెరచాపనై మరుక్షణము తీరానికి చేర్చాలని ఉంది
రెక్క విప్పిన పిట్టనై ఒక క్షణము నింగి తాకాలని ఉంది
పసి పాపనై మరు క్షణము అమ్మ ఒడిని చేరాలని ఉంది
మహా‌ వృక్షమై ఒక క్షణము విస్తరించాలని ఉంది
నాన్న ఎదను చేరి మరుక్షణము నిదురించాలని ఉంది
ప్రచండ కోపమై ఒక క్షణము కలిచివేయాలని ఉంది
గాయపడిన మనసుకే మరు క్షణము మందుగా మారాలని ఉంది
పొగిలే దుఃఖమై ఒక క్షణము అలసిపోవాలని ఉంది
పెదవిపై చిరు నవ్వునై మరు క్షణము మురిసి పోవాలని ఉంది
ఉబికే కోరికనై ఒక క్షణము ఎగసి పోవాలని ఉంది
పాలమీద పొంగులా మరుక్షణము చల్లారాలని ఉంది
విరిసే ఊహనై ఒక క్షణము తేలిపోవాలని ఉంది
రసానుభూతినై మరుక్షణము మిగిలిపోవాలని ఉంది
తీరని బాధనై ఒక క్షణము గుండె పిండాలని ఉంది
వెచ్చని ప్రేమనై మరు క్షణము ఓదార్చాలని ఉంది
తెలియని భావనై ఒక క్షణము యుద్ధం చేయాలని ఉంది
అలవికాని ఆనందమై మరుక్షణము సేద తీరాలని ఉంది
తుంటరి తుమ్మెదనై ఒక క్షణము తేనె గ్రోలాలని ఉంది
పచ్చని కాడనై మరుక్షణము చేయూతనివ్వాలని ఉంది
తెగిన గాలిపటమునై ఒక క్షణము అలజడి రేపాలని ఉంది
తెల్లవారు ప్రకృతిలా మరుక్షణము నిలిచిపోవాలని ఉంది
జారే జలపాతమై ఒక క్షణము‌ ఢీకొట్టాలని ఉంది
అచల ఓర్పునై మరుక్షణము సహియించాలని ఉంది
అమాస చంద్రుడిలా ఒక క్షణము‌ సమసి పోవాలని ఉంది
చైత్రమాసపు చిగురునై మరుక్షణము పూత పూయాలని ఉంది
పొలయు వాసనై ఒక క్షణము వ్యాపించాలని ఉంది
మల్లెల సుగంధమై మరుక్షణము పరిమళించాలని ఉంది

కంటి పాపనై ప్రతి క్షణము కదలాలని ఉంది
గుడి దీపమై‌ అనుక్షణము వెలగాలని‌ఉంది

కవితార్చన – 18

ఊపిరాడకుంటె కాని గాలి విలువ తెలియదు
చీకటావహిస్తె కాని‌ చూపు విలువ తెలియదు
గుండె పగిలితే కాని మనసు విలువ తెలియదు
ఒంటరయితె కాని తోడు విలువ తెలియదు
గతం తవ్వుకుంటె కాని కాలం విలువ తెలియదు
ఓడిపోతెనె కాని ఆలింగనం విలువ తెలియదు
గొంతెండితె కాని వాన విలువ తెలియదు
కడుపు మాడితే కాని రైతు విలువ తెలియదు
దూరమైతె కాని ప్రేమ విలువ తెలియదు
కష్టమెదురైతె కాని స్నేహం విలువ తెలియదు
కొలిమి మంట తాకితె కాని పసిడి కాంతి తెలియదు
ప్రశంశించె మనసుంటే కాని కళల విలువ తెలియదు
ఊత కర్ర చేత పడితె కాని సేవ విలువ తెలియదు
ఆత్మీయుల చిరునవ్వు కంటే కాని తృప్తి విలువ తెలియదు

మునిగి తేలిననాడే లోతు విలువ తెలుస్తుంది
అవకాశం కోల్పోయిననాడే నిరాశ విలువ తెలుస్తుంది
గెలుపు చూసిననాడే పడిన శ్రమ విలువ తెలుస్తుంది
వ్యక్తపరచలేని నాడే మాట విలువ తెలుస్తుంది
భంగపడిననాడే తప్పు విలువ తెలుస్తుంది
పరిపూర్ణత సిద్ధించిన నాడే సాధన విలువ తెలుస్తుంది
కోల్పోయినది దక్కిన నాడే సంతోషము విలువ తెలుస్తుంది
తృటిలో గమ్యం చేజారిననాడే సమయం విలువ తెలుస్తుంది
ఎదురుదెబ్బ తగిలిన నాడే మంచి‌తనం విలువ తెలుస్తుంది
దొడ్డ శిష్యుడున్న నాడె గురువు విలువ తెలుస్తుంది
భాధ పడిన క్షణంనాడే బ్రతుకు విలువ తెలుస్తుంది
అదరణ కరువైన నాడే బంధం విలువ తెలుస్తుంది
నిలువ నీడ లేనినాడే సాయం విలువ తెలుస్తుంది
ఏకాకిగ‌ నడిచిన నాడే దూరం విలువ తెలుస్తుంది

విలువ తెలిసి నడుచుకొనుటయె జీవన‌ పరమార్థం
జన్మ విలువ తెలుసుకోగ కర్మఫలము తరుగుతుంది

కవితార్చన – 17

నదికి కడలికి కలిగెను మధనము
అందుకోగ పైకెగసి గగనము
కలిసి పోటెత్తగ పైపైకి
క్రింద పడెను ప్రతీసారి
వెతను చూచి జాలి ఎంచి
భానుడు ఒక ఉపాయము పంచెను
స్థితి మార్చగ గతి పెంచగ
తెల్లని మబ్బుల దొంతరగా
చేరుకొనెను గమ్యము
సాగిపోగ కొంతదూరము
భారమాయె దాని పయనము
కొండ‌ అంచున సేదతీరుచు
తొంగి చూసె‌ను ధరణి మాతను
ఇచ్ఛ కలిగెను ఒడిన చేరగ
తారలన్ని ఏరుకొనగా
కురవసాగెను చిరుజల్లు వానలా
పుడమి తల్లి నాట్యమాడెను
స్వాగతించెను సంబరంగ
దాచుకున్న కాంక్షలన్ని పురివిప్పగ
కోక కట్టిన కాంతలా వికసించేను పచ్చగ
చేనుగ మారెను ఆకలి తీర్చెను
నదిగ మారెను దప్పిక తీర్చెను
జీవకోటి ప్రతి అణువులోను
భాగమయ్యెను ప్రాణమయ్యెను
ఎంత మార్పు చెందినా
ఎన్ని రూపులెత్తినా
జడధి కలువుటే నీర లక్ష్యము

ఆత్మరామునికాయెను మనసు
పరమాత్మను చేర చేసెను తపసు
జన్మములెత్తెను కర్మలు చేసెను
మోక్షమునొందగ మార్గములెతికెను
గుడిని చేరెను శరణు వేడెను
స్వామి నవ్వెను‌ అభయమునిచ్చెను
సత్కర్మ యోచన
నిష్కామకర్మ సాధన
నిర్మలమైన వాక్కులు
నిశ్చలమైన భావనలు
నిర్మోహమైన సుఖములు
అసంగతమైన సాంగత్యాలు
భగవంతుని నామ స్మరణాలు
అనుసరించగా ఈ ధర్మములు
ఆచరించ తన నిత్య కర్మములు
జీవాత్మయె‌ పరమాత్మగ మారును
విశ్వమునందే విలీనమగును

అనివార్యమైన ఈ జీవన చక్రానికివి
భవుని చేర పరీక్షలు కారెవరు దానికి అతీతులు
పుట్టుట గిట్టుట సృష్టి స్వభావము
ముక్తినెంచ పాటించుము కర్మ సిద్ధాంతము
ఆది అంతము అంతా బ్రహ్మాండము
మొదలునందే తుదను వెతుకును
వింతైన వేదనం విచిత్రమైన పయనం
అనంతములో కరిగిపోవాలని ఆపేక్ష
అంతమవ్వగ అశేషమున నిరీక్షణ

భయం వెనుక ఉంది జయం
అడుగు ముందుకేసి అందుకో విజయం

కవితార్చన – 16

శ్రీకరం నీ రూపు
శుభకరం నీ చూపు
భవహరం నీ తలపు
భయహరం నీ ప్రాపు

కరుణ భరితమయిన నీ నయనాలు
కాంతులు చిందించు కైవల్యాలు
నొసటన భాసిల్లు సూర్య బింబం
ప్రసరించు సకల సౌభాగ్యాల కిరణం
నాసికాగ్రమున రవ్వల ధగధగ
పసిడి కాంతిన చెక్కిలె మెరవగ
పారద్రోలును పాపపు చీకటి తెర
కమ్మల కెంపులె తళ తళలాడగ
ముజ్జగములనె సంరక్షించునుగ
అధరముపై సుమధుర దరహాసం
హరియించును లోభ మద మాత్సర్యం
లోకాలేలే నీ అభయ హస్తం
సమస్త పాప భీతిహరం
మంగళప్రదమైన నీ‌ పాద పద్మములు
మోపిన ఎద వెలుగును నిష్కలంక ప్రకాశమున
పఠియించు నీ నామ స్తోత్రములు
అజ్ఞానాన్ని తరిమి కొట్టే వేద మంత్రములు
అతులితమైన నీ శక్తి స్వరూపం
అమృత తుల్యమైన నీ కటాక్షం
చెరిపివేయును మనసున మలినం

కరుణించి ఏతెంచు నా హృదియందు కొలువుండ
వరమివ్వు తరియించ నిను నిత్యమ్ము ప్రార్థించ
స్తుతియింతు నీ ప్రభనంత నశియించ నా అహమంతా
పావనమైన నీ పాదమంట ముక్తి చేరే మార్గమంట
వెదజల్లు నీ తేజమున కరిగించు నా మోహమంత
వేడెద నే శరణం కావగా నీ ప్రభనే నా తనువంతా
అద్భుతమైన నీ కీర్తి వైభవమంతా శ్లాఘించ నా అణువంతా
ఆత్మనే నీయందు నిలిపెద పంచప్రాణాలే భక్తితో విడువంగ

కవితార్చన – 15

గల గలమంటూ గంటల గణ గణ
ఢమ ఢమ అంటూ బాక్సుల రణగొణ
పీ పీ అంటూ హారను పిలవగ
బిర బిరమంటూ అడుగుల లయ
పద పదమంటూ‌ మాటల వరద
వల వల అంటూ ఏడుపు రొద
గున గునమంటూ బుడతల నడక
చక చక అంటూ‌ పెద్దల గడబిడ

హాయ్ హలో‌అంటూ‌ పలకరింపులు నడిచెను
పట పటమంటూ బుక్కులు తెరిచెను
రెప రెపమంటూ పేపరు ఎగరగ
బర బరమంటూ కలములు కదిలెను
గుస గుస అంటూ‌ చెవులను కొరకగ
సైలెన్స్ అంటూ వీపులు పగిలెను
కర కరమనుచు ఉదరము ఊగెను
ట్రింగుమన బెల్లుకై ఎదురు చూసెను
టప టపమని బాక్సులు తెరిచెను
చక చకమని ఆహారం చేతులు మారెను
జోకులు పేలెను బల్లలు చరిచెను
మాటలు కలిసెను కాలమె మరిచెను
ప్రసంగాలిచ్చెను పాటలు పాడెను
డ్రామాలేసెను డాన్సులు చేసెను
బొమ్మలు‌వేసెను బహుమతులు పట్టెను
హోరు హోరున క్రీడలు సాగెను
ఈలలు వేసెను గోలలు చేసెను
బొట్టు బొట్టుగా స్వేదము చిందగ
ముఖములు విరిసెను చేతులు కలిసెను
టంగు టంగని ఇంటి గంట మ్రోగెను
భుజమున బరువును మోయగ
బిల‌ బిలమంటూ బయటికి ఉరికెను
చేతులు ఊపెను‌ ముందుకు సాగెను
రేపటి కలయిక కన్నుల మెదలగ
పెదవులపై చిరునవ్వులు విరియగ
ఇంటికి చేరును కన్నులు వాలగ

దీని జిమ్మడిపోను కరోనా కాలం
ఏం మొదలయ్యిందో కానీ

భవనములన్నీ బోసిపోయెను
క్లాసు రూములు కళను తప్పెను
అధ్యాపకుల సంభాషణ సందడి లేదు
పిల్లల అడుగుల సవ్వడి లేదు
మేడమ్ సార్ అనే పిలుపులు లేవు
అరేయ్ ఒరేయ్ అనే అరుపులు లేవు

మునుపటి చదువుల అర్థం మారెను
ఉన్న చోటనే పలుకులు పాఠమాయెను
ఎండ అన్నదే కనుమరుగాయెను
కాంతి తెరలకే పరిమితమాయెను
తల్లిదండ్రుల తాకిడి పెరిగెను
క్లాసుమేటులుగ మారిపోయెను
అమ్మ భోజనమె దిక్కయిపోయెను
ఆంటీ స్నాకులే మిస్సయిపోయెను
ఇళ్ళల్లోనే అసెంబ్లీలు
అమ్మ నాన్నల ఫైటులు ఫీటులు
ఆటలన్నవే అలుసయిపోయెను
వేడుకన్నదే వరమయిపోయెను
కలిసి చదవటం కల అయిపోయెను
ఫీజులు మాత్రం ప్రియమయిపోయెను
బోరు కొట్టెను ఒంటరి వీక్షణం
బడుల కొరకేమో తరగని నిరీక్షణం

కరోనా కి కోవిడ్ వచ్చి చచ్చిపోను

కవితార్చన – 14

పండగొచ్చిందోచ్
కరోనా పారిపోయిందోచ్
స్వేచ్ఛ వచ్చిందోచ్
ఖుషీల కాలమొచ్చిందోచ్
బడులకే కళయే వచ్చిందోచ్
పిల్లల సందడి తెచ్చిందోచ్
పర్సులకే రెక్కలొచ్చాయోచ్
ఎగరగ సాకు దొరికిందోచ్
క్రీడలకే కదలిక వచ్చిందోచ్
కేరాఫ్ అడ్రస్సయిందోచ్
పనిమనుషుల డిమాండ్ పెరిగిందోచ్
జీతమే డబులయిపోయిందోచ్
కార్లలో షికారు స్టార్టే అయ్యిందోచ్
మాళ్ళలో షాపింగ్ షురూ అయ్యేనోచ్
కాళ్ళలో చక్రాలు మొలిచేనోచ్
ఊళ్ళకే పరుగులు పెట్టేనోచ్
తల్లిదండ్రుల హడావిడి పెరిగేనోచ్
పెళ్ళి ముచ్చట్లల్లో మునిగేనోచ్
ఆఫీసు ద్వారాలే తెరిచేనోచ్
క్యాంటీన్లో కబుర్లె కలిపేనోచ్
క్యాంపస్ లో కలర్లె విరిసేనోచ్
కొలువుల్లో క్లారిటీ కనపడెనోచ్
వేడుకల్లో వేగం వచ్చేనోచ్
ఒంటరి వినోదాలు తప్పేనోచ్
అతిథుల ఆకలి తీరేనోచ్
ఏకాంత విందులు వదిలేనోచ్
ఓనర్ల ఆశే తీరిందోచ్
అద్దెలే అదుపు తప్పేనోచ్

ఆంక్షలేత్తేసినాకానీ ఓయమ్మా
అలుసుగా తీసుకోవద్దే మాయమ్మా
జాగ్రత్తే మనకు ముద్దే ఓయమ్మా
మంచిది ఉంటే హద్దే మాయమ్మా
ఏ గుహలో ఏ బాటుందో ఓయమ్మా
మళ్ళి మనని పలకరించచ్చేమో మాయమ్మా
బాధ్యత నెరిగి మెదిలెదమే ఓయమ్మా
మాస్కులెన్నడు వదలద్దే మాయమ్మా
చేతులే నీటుగ ఉంచాలే ఓయమ్మా
భౌతిక దూరం మేలే మాయమ్మా
భూమి శ్వాసను కలుషితం చెయ్యద్దే ఓయమ్మా
భావి తరాలను తలచెదమే మాయమ్మా
మంచి బాటలే వేసెదమే ఓయమ్మా
విచ్చలవిడితనమే వద్దే మాయమ్మా
కరోనా గుణపాఠం మరవద్ధే ఓయమ్మా
ఏ వైరస్ కు బలికావద్ధే మాయమ్మా

కవితార్చన – 13

ఒక గర్భము పంచుకుని
ఒక దారం తెంచుకుని
కర్మఫలముననుసరించి
తోబుట్టువులుగ మారి
అనురాగం ఆలంబనగ
అల్లుకొనును బంధములు

అమ్మ నాన్నల ఆత్మల పాలు
సంతతి శ్వాశ నిశ్వాశలు
ముద్దు మురిపెముల మురిసి
ఆనంద ఝరిలొ తడిసి
ప్రపంచంలో పలు దిక్కుల
బతుకు తెరువుకై‌ పయనించె

తిరిగి చూడ చిన్నతనము వంక
ఎన్నెన్ని స్మృతులో ఎనలేని మోదములో
అమ్మ పెట్టు ఆవకాయ ముద్దకై పోటీ
నాన్న చెప్పు చిట్టి కథలకేదీ సాటి
అమ్మ ఒడిని పంచుకొనగ సాగేటి పంతం
నాన్న తెచ్చు కొత్త బుక్కుకై ఎదురు చూచు ఆత్రం
అమ్మ కట్టి ఇచ్చు ఆ ఫలహారమెంత మధురం
నాన్న స్కూటరెక్కి పాఠశాలకెళ్ళుటెంత గర్వం
అలసిన తనువుకు అమ్మ స్పర్శ కమ్మదనం
నేనున్నాననె నాన్న పలుకు ఒక బలం
అమ్మ తోటి పెళ్లి పేరంటాళ్ళకెళ్ళుటకెంత ఆరాటం
నాన్న తోటి క్లాసు బుక్కుల అట్టలేయుటెంత ఉల్లాసం

దీపావళి టపాసులు దాచుకొనెడు కయ్యం
కలిసి‌మెలిసి పాలవెల్లి కట్టుకున్న వైనం
వీక్షించిన మేటి సినిమాలు
మేలుకొని నిద్ర కాచిన రాత్రులు
బ్యాటింగుకై తగాదాలు
అమ్మకి చేసిన ఫిర్యాదులు
హోటల్లో భోజనాలు
హాయిగా నవ్విన క్షణాలు
వేడుకైన రైలు ప్రయాణాలు
సుందర విహారాల చిత్రాలు
చిలిపి కలహాల సందర్భాలు
కొసరి కొసరి వడ్డించిన పదార్థాలు
కొత్త కారు సంబరాలు
ఎగ్జిబిషన్ తిరగడాలు
మిరప బజ్జి కారాలు
కొత్త సరుకు కొనుగోళ్ళు
వీడుకోలు కన్నీళ్ళు
రాసుకున్న ఉత్తరాలు
ఫోను కొరకు పడిగాపులు
రాక కొరకు ఎదురుచూపులు

ఎన్ని కాలాలు మారినా
కొత్త బంధాలు కలిసినా
చెదిరిపోవు ఆ తీపి గురుతులు
కరిగిపోవు మధురమైన జ్ఞాపకాలు
ఉప్పొంగగ ఉత్సాహం
సాగిపోవు మాటల ప్రవాహం
కలుసుకున్న ప్రతిసారి సజీవమౌ
అంతేలేని సరదాలు
దాచుకొనగ మది చాటున
పదిలంగా ప్రియమైన సంగతులు

కవితార్చన – 12

మేరు నగము ఢీకొన మేఘమునకెంత ముచ్చట
కురియగానె భారమంత‌ సాగిపోవు తేలికగా
ఓదార్చు ఒడిని చేర శిరమునకెంత సాంత్వన
మనసు పడిన ఆర్తమె కన్నీరుగ మారగా
సృష్టికి ప్రతిసృష్టి చేయ తల్లి పడే వేదన
ముద్దులొలుకు పసి పాపల మోముకాంచి‌ మురియగ
కడలి చేర బిర‌ బిరా‌ నదులకెంత యాతన
కలిసిపోగ ఉనికి మరచి గమ్యంనే చేరగా
క్రుంగు మదికి రెక్క చాచు పక్షి ఎంత ప్రేరణ
తరచి చూడ తరుణములే నింగి నేల హద్దుగా
తనివితీర నాట్యమాడ మువ్వకెంత‌ తపన
నవ రస‌ తాళ భంగిమలే పలికించగా
పరుల మేలు మదిని తలచె ప్రార్థనెంత కమ్మన
భేదభావ రహిత భవితవ్యం బాసటగ
మగువ కురులు చేరగ మల్లెపూలకెంత వేడుక
పరవశించు ప్రాణనాథ మనసునెంచ బిడియంగా
గుండె దాటి‌ బయట పడగ‌ తలపులకెంత ఆత్రమొ
పంచుకొనగ ప్రేమతీర వలపులన్ని తియ్యగా
ధరణి చెరను వీడి‌ పెరుగ పైరుకెంత పంతమొ
బ్రతుకు కోరె బాటసారి ఆకలినే తీర్చగ
వేచి చూడ ఆ క్షణమునకై కుసుమాలకెంత సహనమొ‌
ఈశుని పాదాల చెంత మోక్షమునే పొందగా
పదములగా మారగ అక్షరాలకెంత ఆశనో
ఆలపించ ఆలయాన భక్తి రాగ కీర్తనగా
ఊపిరిగా మారాలని గాలికెంత తపన
వేణు గానమై మధురముగా అధరమునే తాకగా
భక్తి మీర భజన చేయు భక్తుడెంత ధన్యమో
మదియంతా భగవంతుని నామ స్మరణ నిండగా
ఉలి చాటున మలవగా రాయి దెంత పుణ్యమో
ప్రాణ కోటి అర్చించగ అమ్మవారి రూపుగా/ప్రతిమగా
పాపులని భరియించగా పుడమితల్లికెంత కరుణనో
ప్రకృతి కాంతని పరిరక్షించగ పడుగు అడుగులకాసరగ
కలము తాకి కాగితాన వ్రాల కవితకెంత కాంక్షయో
గళం కదిపి జనం మెచ్చ రసానుభూతినే పొందగా

ఊయలూగు పిల్లపాపల హితము తలచి
భారమన్న తలపు మరచి చేజారనీక ఒడిసి పట్టి
వారి ముఖము‌నందు వెలుగు చూడ
సంతసమున తేలియాడు

చేయి పట్టి మెడలు వంచి గాయపరచ
నెపమెన్నక ఆకలన్నవాని మనసెరిగి
తనలో చిరు పాలుని పంచగ
అమ్మతనంలోని కమ్మతనం
అనుభవించి ఓలలాడు

తన పంచన చేరువాని బడలిక తీర్చనెంచి
కోరుకోగ సౌఖ్యం తన మేనునే కోసి ఇచ్చి
నాన్నతనంలోని గొప్పతనం చవిచూడగ
ఉల్లాసమున‌ ఊగులాడు

పండుగైన వేడుకైన
అందమైన ఆనందమైన
భగవంతుని అలంకారమైన
సుఖమైనా దుఃఖమైన
గుడ్డివాని ఊతమైన
ప్రతి శాఖకి ఆలవాలమైన
మహీజమును మనుజులం
కానలేము మేలుకోము
శ్రద్ధ అనే ధ్యాస రాదు
పోషణనే బాస లేదు

ముఖము వాడ మెడలు వంగ
ధరణి ఒడిని సేద తీర
కనులు వాలి తరువు ఒరగ
పలువురు చేరి పరిపరి విధములు పొగడె
పంచ ప్రాణములు పైకెగరగ

ఉన్నప్పుడు విలువ లేదు
ఉనికి ఘనత తెలుసుకోరు
పాపమనె సంగతి కనరు
పోయాక మరచిపోరు
మాను మనిషి ఒకటే కదా
ఒకే పెట్టెలో ప్రయాణించు
ఒకే గమ్యం చేరుకునే
రెండు జీవితాలు

కవితార్చన – 11

అలసిన మేను సేద తీరే తరుణం
ఆవిష్కరించును ఎల్లలు లేని
ఎన్నడు యోచించని కొత్త ప్రపంచం
వివరము చూడ మొదలవును
అంచులు కానని ఆశల స్వప్న సోపానం
గమ్యం ఎరుగని మనసు ప్రయాణం
రంగులు కాంచని కొత్త స్వరూపం
రెక్కలు విప్పిన ఇచ్చముల సమాహారం
అంతే లేని కోరికల సమూహం
దాచుకున్న తలపుల సారం
ఒళ్ళు తెలియని వింత మైకం
కను రెప్పల చాటున దాగిన శోకం
మదినేలే ముచ్చటల మోదం
పరుచుకున్న ప్రశాంతమైన వాతావరణం
అనుభుక్తులకందని నిశ్శబ్ద ఏకాంతం
అభూత కల్పనల ఆకారం
ఊహకందని అసంకల్పిత కథనం
ఆకృతి కానని కట్టడం
సృష్టికందని నిర్మాణం
దూరం కొలవని ప్రస్థానం
యాతన తెలియని శరీరం
ఋతువులు రాని కాలం
గమనం నేర్వని సమయం
సకల జీవుల అస్తిత్వానికి అతీతం
మేథకు అందని మాయా లోకం
మరణానికి మరో రూపం
సూక్ష్మ శరీరమనుభవించు కర్మఫలం
ఆనందం ఆహ్లాదం
దుఃఖం భయం
క్రోధం ఉల్లాసం
అనుభూతుల మధ్య ఓలలాడు
అంతరాత్మను తట్టి లేపుతుంది అలారం
కన్న కలను నెమరు వేసుకోగ
కొత్త కలను తీర్చిదిద్దుకోగ
పరుగున సాగుతుంది
మరల నూతన జీవన‌ పయనం

కవితార్చన – 10

ఇంద్రధనసు తెల్లబోయెను
పరుచుకున్న రంగులు కాంచి
సువాసనలు సిగ్గు పడెను
పరిమళాల విధము కని
షడ్రుచులే చిన్నబోయెను
పలు రకముల విశేషములు చూసి
అంతులేని ఆకాశం విస్తుబోయె
ధరణి మేని ఆభరణమువలె
నిలిచిన వృక్షరాజములను వీక్షించి

ఊయలూగు పిల్లపాపల హితము తలచి
భారమన్న తలపు మరచి చేజారనీక ఒడిసి పట్టి
వారి ముఖము‌నందు వెలుగు చూడ
సంతసమున తేలియాడు

చేయి పట్టి మెడలు వంచి గాయపరచ
నెపమెన్నక ఆకలన్నవాని మనసెరిగి
తనలో చిరు పాలుని పంచగ
అమ్మతనంలోని కమ్మతనం
అనుభవించి ఓలలాడు

తన పంచన చేరువాని బడలిక తీర్చనెంచి
కోరుకోగ సౌఖ్యం తన మేనునే కోసి ఇచ్చి
నాన్నతనంలోని గొప్పతనం చవిచూడగ
ఉల్లాసమున‌ ఊగులాడు

పండుగైన వేడుకైన
అందమైన ఆనందమైన
భగవంతుని అలంకారమైన
సుఖమైనా దుఃఖమైన
గుడ్డివాని ఊతమైన
ప్రతి శాఖకి ఆలవాలమైన
మహీజమును మనుజులం
కానలేము మేలుకోము
శ్రద్ధ అనే ధ్యాస రాదు
పోషణనే బాస లేదు

ముఖము వాడ మెడలు వంగ
ధరణి ఒడిని సేద తీర
కనులు వాలి తరువు ఒరగ
పలువురు చేరి పరిపరి విధములు పొగడె
పంచ ప్రాణములు పైకెగరగ

ఉన్నప్పుడు విలువ లేదు
ఉనికి ఘనత తెలుసుకోరు
పాపమనె సంగతి కనరు
పోయాక మరచిపోరు
మాను మనిషి ఒకటే కదా
ఒకే పెట్టెలో ప్రయాణించు
ఒకే గమ్యం చేరుకునే
రెండు జీవితాలు

కవితార్చన – 9

రావణుడు పరుషజాలమాడ
సీత ధరియించిన మౌనం ఒక వేదన
దుశ్శాసన చెరబట్టగ శిరసు వంచి
కురుసభనేలిన మౌనం ద్రౌపదియొక్క రోదనం
పితరుల ఆన మీరక రాముడు
వహించిన మౌనం ఒక ఆదర్శం
శిశుపాలుని నూరు‌ తప్పులెన్న
వాసుదేవుడు దాల్చిన మౌనం ఒక ప్రాణం
పుత్ర ప్రీతి కన్నుగప్ప అశక్తుడైన
ధృతరాష్ట్రుడి మౌనం ఒక సమరం
శ్రవణ కుమారుడి ఆక్రందన వెనుక
దశరధుని అసహాయ మౌనం ఒక శాపం

పతి మాటను తల ఎత్తక
నడుచుకున్న సతి మౌనం ఒక బిడియం
ఆనందబాష్పాల హత్తుకొనగ మనసుల
మధ్య సాగే మౌనం ఒక అనురాగం
భుజము తట్టి ఓదార్పు పంచగ
అశ్రునయనాల మౌనం ఒక స్నేహం
కీర్తి శిఖరాల అందుకొనగ
ఎదనిండిన మౌనం ఒక అభిమానం
ఈశ్వరునారాధించ దాసుని
అంతరంగమందునున్న మౌనం ఒక ధ్యానం
ప్రకృతి కాంచి పరవశించ చిత్రకారుని
హృదినాక్రమించిన మౌనం ఒక ఆరాధనం
మధువు గ్రోల‌ దరిచేరిన తేనీగను కావ
సుమమునావహించిన మౌనం ఒక ఆనందం

అన్యాయము కని కసరలేని
పెదవి చాటు మౌనం ఒక పాపం
అధర్మాన్ని ప్రశ్నించగ గళం
వీడిన‌ మౌనం ఒక ఆవేశం
దొరతనమును నిగ్గదీయ చేతకాని
దమ్ము లేని ప్రజల మౌనం ఒక అవమానం

ముదము కూర్చగ మౌనమాడుట
మేటి కదరా మిత్రమా
మేలు చేయగ మౌనమన్నది
విలువ చేయును మాటకన్నను

నీతి విడవగ ప్రాణమొప్పక
శీలమన్నది గతి తప్పి మెలుగగ
మౌనమన్నది కారాదు మాత్రమొక మాట
మౌనమన్నది కాజాలదు సంఘానికొక గరిమ

భాషకందని భావాల సంగమం
నవరసాల‌ సారం ఈ మౌనం
కాలమెరుగదు ఖ్యాతి గాంచదు
హితమునెంచగ నడుచుకొనుటయె
మానవుల యొక్క ధర్మం
లోపమెన్నగ గీత దాటుట
సమాజం యొక్క కర్తవ్యం

కవితార్చన – 8

ఎద నిండ నింపుకుని ఎలుగెత్తి పిలువగా
ఏడు కొండల మీద ఎంకన్ననార్తిగా
కనుల ముందరె కాంచగ
అభయ హస్తములతోడుగ
కలవరపడుతున్నది మది కొండనెక్కగ
కరుణనిండిన నేత్రములను కావగ
ఆనతినియ్యవయ జాగును చేయక
హోరెత్తు నీ నామ సంకీర్తనముల
తరియింతును నీ మంగళ పదముల
కరుణించుము నను వేగిరముగ
ఇక వేచి చూడ నా వల్ల కాదయా
గోవిందా గోవింద

కవితార్చన – 7

కేరింతల కలరవముల కనుమరుగాయె బాధ
బేలతనపు చూపుల కని మరిచిపోయె వ్యధ
వాడే తన లోకమై కోరి’కల’ రూపమై
బొమ్మయై ఆట బొమ్మయై
అలసట విడచెను కాలమె మరచెను
ముద్ధు మురిపెముల మునిగెను మనసు
హద్ధులెరుగక మెలిగెను తనువు
మది మురిసెను ముదమున తడిసెను
కాలచక్రము గిర్రున తిరిగెను
జవములు సడలెను చూపులు కరిగెను
నడుములు వంగెను వినికిడి తరిగెను
నడిపించిన చేతిలొ మరల
బొమ్మనై ఆట బొమ్మనై
మది మురిసెను ముదమున తడిసెను

కవితార్చన – 6

తలవంచి నీ వెంట నడిచింటి నేనంట
కష్ట సుఖముల తోడ కలిమి‌ లేముల నీడ
కరిగి పోయెన కాలము, చిరు కయ్యమునెంచ
కసుబుస్సులను కాంచి కలచేను నా ఎడద
కొండంత నీ ప్రేమ శంకింప నేనెంత
తప్పులన్ కాచి మన్నించు నా మదినెంచి
నా హృదిని ఏలేటి రారాజు నీవేనంట
నీకేల నినదించు నా శ్వాశ నీదేనంట
ఎన్నాళ్ళొ కానీ నా యాత్ర నీ వెంట
ఏమియ్య తీరునో నీ యందు ఋణమంట
జననమెక్కడ కానీ, మరణమ్ము నీ చెంత
కన్ను మూసేవేళ ఆ చివరి క్షణమంట
నమ్ము నిక్కంబు నీ రూపు‌ నా కంట
పెదవి దాటని మాట పదములై మారె ఈ పూట
మనస్సాక్షియే అక్షరములుగ మారగ

కవితార్చన – 5

కన్న తల్లి స్పర్శకి పరిచయమనేదవసరమా
కురుస్తున్న మేఘానికి ఛత్రమొకటి అవసరమా

వెలుగుతున్న సూర్యునికి దీపమొకటి అవసరమా
కదులుతున్న కాలానికి యుగములతో అవసరమా

పచ్చటి బయలున్న పుడమికి ఆఛ్ఛాదనమవసరమా
చక్కనైన చంద్రునిలో మచ్చలెతుకుటవసరమా

హరి కాంచను, హృదయానికి హద్దులెన్న అవసరమా
వేడుకొన హరుని కష్టసుఖాలనేవవసరమా
భజియించగ భగవంతు సంకీర్తనలే అవసరమా
నీ మదినే నివేదించ నైవేద్యం అవసరమా

లోతెరుగని కడలికి తీరమొకటి అవసరమా
మిణుకుమన్న తారల దూరమెన్న అవసరమా

మెచ్చుకోలు వ్యక్తపరచ భాష ఒకటి అవసరమా
మధువులొలుకు నాదానికి భావమొకటి అవసరమా
స్వచ్ఛమైన క్షీరానికి గోవునెన్న అవసరమా
అల్లుకున్న బంధాలకు హెచ్చుతగ్గులవసరమా

తరచి తరచి మనసులలో మలినమెన్న అవసరమా
సాయమడుగు చేతి, కులమతములెన్న అవసరమా
ద్రవ్యానికి పేద గొప్ప భేదములెన్న అవసరమా
మనుషులంత ఒక్కటైతె సరిహద్ధులన్నవవసరమా

మతమన్న మత్తు వదిలి
కులమన్న మన్ను కడిగి
ధరణి మోము ముదమొందగ
మనుగడ సాగించుట అవసరమే అవసరమే

కవితార్చన – 4

సోది చెబుతానమ్మ సోది చెబుతాను
ఉన్నదున్నట్టు దుఃఖమొచ్చేటట్టు

మార్చి ముందరంట మరపురాని కాలమంట
వారానికో సినిమా అంట పక్షానికో పార్టీ అంట
మనసయితె మాళ్ళకెళ్ళెనంట
బోరు కొడితె బార్లకెళ్ళెనంట
అబ్బబ్బ ఏమి జీవితమంట
ఎల్లలు లేని ప్రయాణమంట

అలా జాలీగా సాగిపోతున్న జీవితంలో

ఉన్నట్టుండి ఊడిపడిందమ్మ
ఊహించని ఉల్కాపాతమమ్మ
కరోనా అంట దాని నామధేయమమ్మ

మనిషి బతుకమ్మ ఎగుడు దిగుడాయెనమ్మ
మూతులకు మాస్కులేసెనమ్మ
కడిగి కడిగి కరములు కట్టెలాయెనమ్మ
కాలికి చెప్పు కరిచిపెట్టెనమ్మ
ఇంటికి తాళము మరిచెపోయెనమ్మ
మగని చేతికి మాపు వచ్చెనోయమ్మ
లోకమంత చూపి పొంగిపోయెనమ్మ
పాంటులేమో షార్టులాయెనమ్మ
మీటింగులలో కూరలేరుడాయెనమ్మ
పిల్లగాండ్ల పంతాలు పెరిగి పోయెనమ్మ
బక్కచిక్కి ఇల్లాలు బెదిరిపోయెనమ్మ
సరుకులు తెచ్చుకొనుడు గగనమాయెనమ్మ
స్మార్ట్ యాపులే సక్కని మార్గమాయెనమ్మ
బంథుమిత్రుల రాక ఆగిపోయెనమ్మ
సెల్లు ఫోనులో సొల్లు, గంటలాయెనమ్మ
జూములోన జనాల జాతరాయెనమ్మ
పసి కూనలకు ఆన్లైను క్లాసులాయెనమ్మ

ఇక చెప్పోచ్చేదేంటంటే
కాలం వెనకడుగు వేసెనంట
పెద్దల మాట వేదమాయెనంట
పాత పద్ధతులే పానమాయెనంట
దూరమున్న మనసులు దగ్గరాయెనంట

సోది చెబుతానమ్మ సోది చెబుతాను

కవితార్చన – 3

వ్యక్తపరుచు నేస్తమా
నీ గొంతునున్న భావన
అక్షరాలు‌ మరువక
చక్షితాలు మెరవగా
బిడియాన్నే విడువగా
లోకానికె బెదరక
కన్న కలల సాక్షిగా
కాలాన్నే మరువగా

దాచుకున్న ఆర్తిని
దోచుకున్న మనసుని
నిద్ర లేని రాత్రులని
కూడు తినని పొద్దుల్ని
తెలివి లేని తనువుని
చెప్పలేని భాధని
మాట రాని మౌనాన్ని
పట్టలేని ప్రాయాన్ని
అదుపు లేని ఆశల్ని
గుండెలోతు గోసల్ని
తాళలేని తాపాన్ని
చూపలేని దైన్యాన్ని
ఆపలేని ఆవేశాన్ని
కానరాని కోపాన్ని
పెంచుకున్న ప్రేమని
తెంచలేని తలపుని

తొలకరి జడి వానలా
ఆకు మీద చినుకులా
వీచిన చిరు గాలిలా
విరబూసిన వెన్నెలలా
మగువ మేని సొగసులా
మెడనున్న ముత్యంలా
పసిపాపడి చూపులా
పాలనురగ నవ్వులా
పరుచుకున్న కాంతిలా
పట్టలేని పరువంలా
హత్తుకున్న హృదయంలా
హద్దేలేని మిన్నులా
మరువలేని మైత్రిలా
మరపు రాని జ్ఞాపకంలా

హాయిగా
తేనెలొలుకు మాటలా
మరిచిపోని పాటలా
మల్లెపూల తెలుపులా
తీరుతున్న కోరికలా
వ్యక్తపరుచు నేస్తమా
నీ గొంతునున్న భావన

Create a website or blog at WordPress.com

Up ↑