కవితార్చన – 10

ఇంద్రధనసు తెల్లబోయెను
పరుచుకున్న రంగులు కాంచి
సువాసనలు సిగ్గు పడెను
పరిమళాల విధము కని
షడ్రుచులే చిన్నబోయెను
పలు రకముల విశేషములు చూసి
అంతులేని ఆకాశం విస్తుబోయె
ధరణి మేని ఆభరణమువలె
నిలిచిన వృక్షరాజములను వీక్షించి

ఊయలూగు పిల్లపాపల హితము తలచి
భారమన్న తలపు మరచి చేజారనీక ఒడిసి పట్టి
వారి ముఖము‌నందు వెలుగు చూడ
సంతసమున తేలియాడు

చేయి పట్టి మెడలు వంచి గాయపరచ
నెపమెన్నక ఆకలన్నవాని మనసెరిగి
తనలో చిరు పాలుని పంచగ
అమ్మతనంలోని కమ్మతనం
అనుభవించి ఓలలాడు

తన పంచన చేరువాని బడలిక తీర్చనెంచి
కోరుకోగ సౌఖ్యం తన మేనునే కోసి ఇచ్చి
నాన్నతనంలోని గొప్పతనం చవిచూడగ
ఉల్లాసమున‌ ఊగులాడు

పండుగైన వేడుకైన
అందమైన ఆనందమైన
భగవంతుని అలంకారమైన
సుఖమైనా దుఃఖమైన
గుడ్డివాని ఊతమైన
ప్రతి శాఖకి ఆలవాలమైన
మహీజమును మనుజులం
కానలేము మేలుకోము
శ్రద్ధ అనే ధ్యాస రాదు
పోషణనే బాస లేదు

ముఖము వాడ మెడలు వంగ
ధరణి ఒడిని సేద తీర
కనులు వాలి తరువు ఒరగ
పలువురు చేరి పరిపరి విధములు పొగడె
పంచ ప్రాణములు పైకెగరగ

ఉన్నప్పుడు విలువ లేదు
ఉనికి ఘనత తెలుసుకోరు
పాపమనె సంగతి కనరు
పోయాక మరచిపోరు
మాను మనిషి ఒకటే కదా
ఒకే పెట్టెలో ప్రయాణించు
ఒకే గమ్యం చేరుకునే
రెండు జీవితాలు

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑