కలిమి కలిగించగ కాకరపువ్వులు
ముదము పంచగ మతాబు మెఱుగులు
బిర బిర తిరుగుచు విష్ణుచక్రము
కడతేర్చగ కడు కష్టనష్టములు
గిర గిర గెంతుచు భూచక్రము
తరిమివేయగ కలతల వెతలను
తళుకుల బెళుకుల చిచ్చుబుడ్డులు
ప్రతి లోగిలిలో కాంతిని నింపగ
రివ్వున ఎగిరే తారాజువ్వలు
నింగికి మోయగ నిరాశతనమును
ఢమ ఢమ పేలుచు సీమ టపాసులు
అదురు బెదురునే పరిగెట్టించగ
కలిసి వచ్చెను హర్షము నింపగ
ఉత్సాహం మెండుగ ఉల్లాసం పండుగ
దీప కాంతులే ధగ ధగ మెరవగ
ప్రజ్వలిస్తున్న జ్యోతుల నడుమ
యశము స్వాస్థ్యము తోడ్కొనిరాగా
అష్ట లక్ష్ములే కొలువు తీరును
అభయ హస్తమునె సంరక్షించగ
పారద్రోలును పాపపు బెడదను
చెరిపివేయును దైన్యపు తెరలను
విరచిమ్మగ వెలుగును అవిలో,మదిలో
ధనధాన్యమ్ములే రాశులు పోయగ
సౌభాగ్యాల సిరులే పొంగగ
కటాక్షించును కోరికల కుంభము
కలిగించును సంపదల కూరిమి
హితము కూర్చును వంశపు వృద్ధికి
కరుణ చూపున చల్లని దీవెన
ప్రతి ఇంటా దీపావళి కురిపించాలి
కాసుల సిరి ,ఆనందాల ఝరి
Leave a Reply